Latest NewsReviews

మిస్టర్ మజ్ను మూవీ రివ్యూ

రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ వస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్. ఆయన నటించిన మూవీ ‘మిస్టర్ మజ్ను’ శుక్రవారం తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున రిలీజైంది. అఖిల్ పక్కన తొలిసారి నిధి అగర్వాల్ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి డైరెక్టర్.

స్టోరీ

విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ (అఖిల్‌) యూకేలో ఎంఎస్‌ చదువుతుంటాడు. ఇతడ్ని చూడ‌గానే ప్రతీ అమ్మాయి ఇష్టప‌డుతుంది. త‌న‌కు కాబోయే భర్త శ్రీరాముడిలా ఉండాల‌ని క‌ల‌లు కనే ఓ సాధారణ అమ్మాయి నిక్కీ (నిధి). చివరకు ఇద్దరు ఒకే ఫ్లైట్‌లో ఇండియాకు వస్తారు. తాము బంధువుల‌మేనన్న విషయం ఎయిర్‌పోర్టులో తెలుస్తుంది. నిక్కీ అన్న (రాజా)ను విక్కీ చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాల‌ని ఇరు కుటుంబాలు భావిస్తాయి. ఒక‌రింటికి మ‌రొక‌రు వ‌చ్చిపోయే క్రమంలో విక్కీ మ‌న‌సేంటో తెలుసుకుని అత‌డితో ప్రేమ‌లో ప‌డుతుంది నిక్కీ. ఆ తర్వాత అనుకోని సంఘటనల కారణంగా వీళ్లిద్దరు విడిపోతారు. వీళ్ల పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్లిందా? ఇద్దరూ క‌లిసి జీవితాన్ని పంచుకున్నారా? అన్న విషయాలు తెలియాలంటే తెరపై
చూడాల్సిందే!

విశ్లేషణ…

గత సినిమాలతో పోల్చితే అఖిల్ నటనలో కాస్త మెట్యూరిటీ కనిపించింది. ప్లే బాయ్‌గా విక్కీ పాత్రలో చక్కగా ఆకట్టుకున్నాడు. కొత్త లుక్‌తో ఫ్రెష్‌గా కనిపించాడు. నిధి అగ‌ర్వాల్.. అందం, అభిన‌యం ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. గ్లామర్‌తోపాటు తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ఎమోషనల్, లవ్ సీన్స్‌లో బాగా నటించింది. ఫస్టాప్ వినోదం, సెంటిమెంట్ స‌న్నివేశాలు, బ్రేక‌ప్‌తో ముగుస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి చెప్పడానికి కొత్తగా ఏమీవుండదు. తాను కాద‌నుకున్న అమ్మాయి కోసం మ‌ళ్లీ లండ‌న్ వెళ్తాడు హీరో. అక్కడ ఆమెని మ‌ళ్లీ ప్రేమ‌లో దించేందుకు ప్రయ‌త్నిస్తాడు. క్లైమాక్స్ వ‌ర‌కు హీరోకి అదొక్కటే ప‌నికావ‌డంతో స‌న్నివేశాలు త‌ప్ప కొత్తగా ఏమీవుండదు. ప్రియ‌ద‌ర్శి, విద్యుల్లేఖ రామ‌న్‌, సుబ్బరాజు, హైప‌ర్ ఆది త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌వ్వించారు.

రావు ర‌మేష్‌, జ‌య‌ప్రకాష్‌, నాగ‌బాబు, ప‌విత్ర లోకేష్‌, సితారతోపాటు ప‌లువురు న‌టులు పాత్రల‌కు ప్రాధాన్యం తక్కువ. మంచి స్టోరీ లైన్‌ను తీసుకున్న దర్శకుడు, దాన్ని పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా రాసుకోలేదు. హీరో, హీరోయిన్‌ల మధ్యన ప్రేమ సీన్స్ పూర్తిగా ఆకట్టులేదు. కొన్ని కీలక సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ, ఆ విధంగా మలచలేకపోయారు. దీనికితోడు నేరేషన్ మెల్లగా సాగడం, లవ్ స్టోరీ పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం, హీరోయిన్ క్యారెక్టరజేషన్‌లో సరైన క్లారిటీ లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. చాలా సన్నివేశాలు డైరెక్టర్ ఫస్ట్ మూవీ ‘తొలిప్రేమ’ని గుర్తు చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.. లండన్‌లో తెరకెక్కించిన దృశ్యాలు బాగున్నాయి. మిగతా విభాగాలు ద‌ర్శకుడి ఆలోచ‌న‌ల‌కు త‌గ్గట్టుగా వున్నాయి. మొత్తానికి పాత సీసాలో కొత్త సారా అన్న టైప్‌లో సాగింది మిస్టర్ మజ్ను.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here